: రేపు చైనా పర్యటనకు ప్రణబ్.. 'నీట్' ఆర్డినెన్స్ పై ఈరోజు మధ్యాహ్నం రాష్ట్రపతి సంతకం?
నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను వాయిదా వేస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ విషయంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మరికాసేపట్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ కానున్నారు. నీట్‌పై రాష్ట్రాలనుంచి వచ్చిన అభ్యంతరాలు, వాయిదా వేయాల్సిన ఆవశ్యకతపై రాష్ట్రపతికి నడ్డా స్పష్టత ఇవ్వనున్నారు. ప్రణబ్ ముఖర్జీ రేపటి నుంచి ఈనెల 27 వరకు చైనాలో పర్యటించనున్నారు. రాష్ట్రపతిగా ప్రణబ్‌కు ఇదే తొలి చైనా పర్యటన. దీంతో ఆర్డినెన్స్ పై కీలక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఇదిలా వుండగా, నీట్‌పై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి సంతకం చేయొద్దంటూ నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై ఉత్కంఠ నెలకొంది.