: రెండున్నర గంటలు, 1400 ఏటీఎంలు, రూ. 86 కోట్లు హాంఫట్!


డెబిట్, క్రెడిట్ కార్డులను క్లోనింగ్ చేసిన ఓ ముఠా, రెండున్నర గంటల వ్యవధిలో కోట్లాది రూపాయలను ఏటీఎంల నుంచి నగదు రూపంలో విత్ డ్రా చేసిన సంచలన ఘటన జపాన్ లో జరిగింది. పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, సౌతాఫ్రికాకు చెందిన ఓ బ్యాంకు జారీ చేసిన కార్డుల సమాచారాన్ని ఫోర్జరీ చేసిన ముఠా ఈ ఘటనకు పాల్పడింది. మొత్తం 100 మంది సభ్యులున్న ముఠా, 1400 ఏటీఎంలలోకి వెళ్లి సుమారు రూ. 86 కోట్లను తస్కరించింది. టోక్యో, కనగవా, ఐచి, ఒసాకా, ఫుకోకా తదితర ప్రాంతాల్లో ఆదివారం నాడు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల మధ్య ఈ లావాదేవీలు జరిగాయి. ఏటీఎంల నుంచి ఒక్కో లావాదేవీపై 900 డాలర్ల వరకూ గరిష్ఠంగా తీసుకునే వీలుండగా, మొత్తం 14 వేలకు పైగా లావాదేవీలు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. మొత్తం 1,600 కార్డులను వాడినట్టు గుర్తించామని, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు. కాగా, ఒమన్ కు చెందిన బ్యాంకు జారీ చేసిన కార్డుల సమాచారంతో, 2012-13 మధ్య 26 దేశాల్లోని ఏటీఎంల ద్వారా 40 మిలియన్ డాలర్లను కొల్లగొట్టిన ఉదంతం తరువాత, ఇంత భారీ స్థాయిలో కార్డుల డేటా తస్కరణ, ఏటీఎంలపై దాడుల ఘటన వెలుగుచూడటం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News