: విదేశాల్లోనూ కార్తీ చిదంబరం వ్యాపారాలు?... 14 దేశాలకు ఈడీ లేఖలు


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కార్తీ చిదంబరం ఆధ్వర్యంలో నడుస్తున్న పలు కంపెనీలపై ఇటీవల ఆదాయపన్ను శాఖ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆదాయపన్ను శాఖ స్వాధీనం చేసుకున్న పలు కీలక పత్రాలను పరిశీలించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు... ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో అసలు కార్తీ చేస్తున్న వ్యాపారాలు సక్రమమా? అక్రమమా? అనే కోణంలో విచారణకు ఆ సంస్థ రంగంలోకి దిగింది. విదేశాలకూ విస్తరించిన కార్తీ వ్యాపాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఈడీ ఏకంగా 14 దేశాలకు లేఖలు రాసింది. ఈడీ లేఖలు రాసిన దేశాల్లో బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్ తో పాటు బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికా, అమెరికా, గ్రీస్, స్పెయిన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, మలేసియా, సింగపూర్, థాయ్ ల్యాండ్, శ్రీలంక దేశాలున్నాయి. ఆయా దేశాల్లోని కార్తీ ఆస్తులు, బ్యాంకు కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు అందజేయాలని ఆ లేఖల్లో ఈడీ కోరింది. మరోవైపు ఈ వ్యవహారంలో కార్తీని ప్రశ్నించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. వెరసి త్వరలోనే కార్తీ మరింత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News