: ప్రియాంకా గాంధీ బరిలోకి దిగితే... బీజేపీకి ముచ్చెమటలే!: రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్య
కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. మూడు దశాబ్దాల తర్వాత స్పష్టమైన మెజారిటీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. త్రిబుల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్ కు పడిపోయిన కాంగ్రెస్ పార్టీ బలం ఆ పార్టీకి లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదాకూ ఎసరు పెట్టిన సంగతి తెలిసిందే. వాగ్ధాటిలోనే కాక పాలనలోనూ సుదీర్ఘ అనుభవమున్న నరేంద్ర మోదీని ఇబ్బంది పెట్టే నేతలు కాంగ్రెస్ లో దాదాపుగా లేరనే చెప్పాలి. అయితే ఇదే విషయంపై ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ను కదిలిస్తే... ఆయన నోటి వెంట ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించాయి. ‘నవభారత్ టైమ్స్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాందేవ్ బాబా మాట్లాడుతూ... సోనియా గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ వాద్రా పేరును ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ప్రియాంకా గాంధీ చేపడితే... బీజేపీ మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.