: తమిళ సీఎంగా ‘అమ్మ’ ప్రమాణం నేడే!... మద్రాస్ వర్సిటీలో ఏర్పాట్లు పూర్తి
తమిళనాడు ముఖ్యమంత్రిగా ‘పురచ్చితలైవి’ జయలలిత నేడు పదవీ ప్రమాణం చేయనున్నారు. గడచిన మూడు దశాబ్దాలుగా వరుసగా రెండో టెర్మ్ తమిళ సీఎం పగ్గాలు చేపట్టిన నేతగా జయలలిత రికార్డు పుటల్లోకి ఎక్కనున్నారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో డీఎంకే చీఫ్ కరుణానిధికి షాకిచ్చిన తమిళ తంబీలు ‘ఉచిత’ మంత్రం పఠించిన జయలలిత వైపే మొగ్గుచూపారు. మూడు దశాబ్దాలుగా సాగుతూ వస్తున్న సంప్రదాయానికి తెర దించుతూ అన్నాడీఎంకేకు వరుసగా రెండో పర్యాయం కూడా అధికారం కట్టబెట్టారు. స్పష్టమైన మెజారిటీ సాధించిన జయలలిత... నేడు రెండో పర్యాయం ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. తన పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి వేదికగా నిలుస్తూ వస్తున్న మద్రాస్ యూనివర్సిటీలోనే ఈ సారి కూడా జయ ప్రమాణం చేస్తారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య... జయలలితతో ప్రమాణం చేయించనున్నారు. ఆమెతో పాటుగా 28 మంది మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు.