: గోవాలో పాగా వేసేందుకు ఆప్ ప్రణాళికలు
దేశ రాజధానిపై గురిపెట్టి విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ గోవా, పంజాబ్ లపై దృష్టి పెట్టిందా..? త్వరలో జరిగే గోవా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆ పార్టీ భావిస్తోందా...? పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 67 స్థానాలను గెలుచుకుని అధికార పగ్గాలను చేపట్టిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ మరే ఇతర రాష్ట్ర ఎన్నికల్లోనూ ఇప్పటి వరకూ సత్తా చాటలేకపోయింది. అయితే, 2017లో జరిగే గోవా, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. పనాజిలో ఆదివారం జరిగే పార్టీ ర్యాలీలో ఈ దిశగా పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన చేయవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. 'రాజకీయ విప్లవానికి గోవా సిద్ధం' అంటూ ఇంగ్లిష్ లో రాసి ఉన్న పోస్టర్లను పార్టీ నాయకులు పనాజిలో భారీగా ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రం చిన్నది కావడం, మొత్తం అసెంబ్లీ స్థానాలు 40 వరకే ఉండడంతో శ్రమకోర్చితే అధికారం ఖాయమని ఆమ్ ఆద్మీ భావిస్తోంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్ లో నాలుగు లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి సైతం వచ్చే ఏడాదే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ కూడా పోటీ చేసి సాధ్యమైనన్ని స్థానాలను గెలుచుకోవాలని ఆమ్ ఆద్మీ ఉవ్విళ్లూరుతోంది. అందుకే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను నియమించుకుంది.