: ఉత్తరాఖండ్ సీఎంకు మళ్లీ సీబీఐ సమన్లు
ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం సమయంలో సంచలనం సృష్టించిన స్టింగ్ ఆపరేషన్ కు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్ కు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. రాజకీయ సంక్షోభం సమయంలో రెబెల్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొనేందుకు హరీశ్ రావత్ డబ్బు ఆశ చూపినట్లు ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియో కలకలం సృష్టించింది కూడా. ఈ ఆరోపణలపై కేసు నమోదు చేసిన సీబీఐ.. తమ ఎదుట హాజరుకావాలంటూ ఇప్పటికే రెండుసార్లు సమన్లు జారీ చేసింది. తాజాగా మంగళవారం విచారణకు రావాలంటూ సోమవారం సమన్లు పంపింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బల నిరూపణ జరిగి హరీశ్ రావత్ తిరిగి సీఎంగా బాధ్యతలు కూడా చేపట్టిన తర్వాత సీబీఐ విచారణ వ్యవహారం సంచలనం రేపుతోంది.