: ఇండోనేసియాలో పేలిన అగ్ని పర్వతం.. ఆరుగురు మృతి


ఇండోనేషియాలో మౌంట్ సినాబుంగ్ అగ్ని పర్వతం బద్దలైంది. భారీగా బూడిదను, పొగను వెదజల్లుతోంది. అత్యంత వేడిగా ఉన్న బూడిద, విష వాయువుల కారణంగా ఆరుగురు మరణించగా.. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇండొనేషియా అధికార వర్గాలు ప్రకటించాయి. వారంతా అగ్నిపర్వతం పక్కనే ఉన్న గాంబర్ అనే గ్రామానికి చెందినవారు. ఇండొనేషియా పశ్చిమ ప్రాంతంలోని సుమత్రా దీవిలో ఉన్న ఈ అగ్నిపర్వతం నాలుగు వందల ఏళ్ల కింద పూర్తి స్థాయిలో బద్దలైంది. తిరిగి 2013 నుంచి చురుగ్గా మారింది. 2013లో బూడిద, వాయువులను వెదజల్లడంతో దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించారు. అయినా వ్యవసాయం కోసం ప్రజలు ఆ ప్రాంతానికి వెళుతూనే ఉంటారు. తిరిగి 2014లో ఈ అగ్ని పర్వతం బద్దలై ఆకాశంలో కిలోమీటర్ల ఎత్తున బూడిదను వెదజల్లింది. అప్పుడు దాదాపు 16 మంది మరణించారు. భూకంపాలు, అగ్ని పర్వతాలు ఎక్కువగా ఉండే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’పై ఉన్న ఇండొనేషియాలో 129 అగ్ని పర్వతాలు క్రియాశీలంగా ఉండడం గమనార్హం.

  • Loading...

More Telugu News