: వస్తున్నాం...బాబ్రీ, కాశ్మీర్, గుజరాత్, ముజఫర్ నగర్ అల్లర్లకు ప్రతీకారం తీర్చుకుంటాం: ఐఎస్ఐఎస్ హెచ్చరిక
'మేము వస్తున్నాం. బాబ్రి మసీదు, కాశ్మీర్ బాధితులు, గుజరాత్ అల్లర్లు, ముజఫర్ నగర్ అల్లర్లలో ముస్లిలంను చంపినందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు కత్తులు పట్టుకొని వస్తున్నాం, ప్రతీకారం తీర్చుకుంటాం' అంటూ ఐఎస్ఐఎస్ ఓ వీడియోను ఆన్ లైన్ లో పోస్టు చేసింది. 22 నిమిషాల నిడివిగలిగిన ఈ వీడియోలో ఉగ్రవాదులు అరబిక్ భాషలో మాట్లాడారు. ఐసిస్ లో భారత్ కు చెందిన ఉగ్రవాదులు ఏయే హోదాల్లో ఉన్నారో తెలిపింది. ఈ వీడియోలో 2014 నుంచి ఇరాక్, సిరియాలో ఫైటర్లుగా కొనసాగుతున్న ఐదుగురు జిహాదీల ఇంటర్వ్యూలు జతచేసింది. ఆన్ లైన్ లో భారత్, దక్షిణాసియాను లక్ష్యం చేసిన తొలి వీడియో ఇదే కావడం విశేషం. ఐఎస్ఐఎస్ పేర్కొన్న భారతీయుల్లో ఒక్కడిని గుర్తించారు. 2014లో సిరియా చేరుకున్న థానేకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ఫహద్ తన్వీర్ షైక్ ఇంటర్వ్యూలో కనిపించడం విశేషం. మరో ఇద్దరితో కలిసి ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు సిరియా వెళ్లిన ఫహద్... షైక్ అబూ అమర్ ఆల్ అనే మారు పేరుతో ఈ వీడియోలో హిందీలో మాట్లాడాడు.