: అడ్డదారిలో అమెరికా వెళదామని ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయిన ప్రబుద్ధుడు
డాలర్ డ్రీమ్స్ తో అడ్డదారుల్లో అమెరికా వెళ్లిపోయి ఉన్నత చదువులు చదివేసి, అక్కడే స్థిరపడిపోయి డాలర్లు సంపాదించేద్దామని కలలు కన్న ఓ ప్రబుద్ధుడు అమెరికా కాన్సులేట్ అధికారులకు అడ్డంగా బుక్కయిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...అల్వాల్ కు చెందిన బి.సాయివర్ధన్ రెడ్డి ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాలని భావించాడు. అలా వెళ్లేందుకు సరిపడా అర్హతలు లేకపోవడంతో, వీసా పొందేందుకు అవసరమైన పత్రాల కోసం కర్నూల్ కు చెందిన డెంటిస్ట్ వెంకటేష్ ను సంప్రదించాడు. దీంతో ఆయన రాజస్థాన్ లోని సీజర్ యూనివర్సిటీలో సాయివర్ధన్ రెడ్డి చదివినట్లుగా నకిలీ విద్యార్హత పత్రాలు సృష్టించాడు. వీటితో సాయివర్ధన్ రెడ్డి బేగంపేటలోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంలో గత మార్చిలో వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతని దఖాస్తును పరిశీలించిన అధికారులు అవి నకిలీవిగా గుర్తించారు. అతనికి వీసా నిరాకరించిన అధికారులు అతని సర్టిఫికేట్లను మాత్రం తమ వద్దే ఉంచుకున్నారు. వాటిని వాపస్ తీసుకునేందుకు సాయివర్ధన్ రెడ్డి యూఎస్ కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లడంతో వారు బేగంపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు రంగప్రవేశం చేసి సాయివర్ధన్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనికి నకిలీ పత్రాలు సమకూర్చిన వెంకటేష్ ను సైతం అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.