: నిద్రమత్తులో టాక్సీ డ్రైవర్... డ్రైవింగ్ సీట్లో ప్యాసింజర్!
పట్టణాల్లో ట్యాక్సీ డ్రైవర్లు పగలు, రాత్రి అని తేడా లేకుండా వాహనాలు నడుపుతూ నిద్రలేమిని అనుభవిస్తున్నారు. యూనియన్లు పెరిగిపోవడంతో ట్యాక్సీలకు బేరాలు ఉండడం లేదు. బేరం ఉంటే కానీ డబ్బులు రావు. దీంతో డ్రైవర్లు నిద్రమత్తులో జోగుతుంటారు. అప్పుడే యాక్సిడెంట్లు చోటుచేసుకుంటాయి. అలాంటి పరిస్థితిని గుర్ గావ్ లో ఎదుర్కొన్న ఓ ప్రయాణికుడు ఓ 9 సెకెన్ల వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. గిల్ అనే ఫైనాన్షియల్ అనలిస్టు దక్షిణ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ నుంచి డీఎల్ఎఫ్ ఫేజ్2లో గల తన ఇంటికి ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు. క్యాబ్ లో కొంతదూరం వెళ్లాక నిద్రమత్తులో జోగుతున్న డ్రైవర్ డివైడర్ ను ఢీకొట్టాడు. దీంతో గిల్ సీట్లోంచి లేచి డ్రైవర్ ను తన సీట్లో కూర్చోబెట్టి డ్రైవింగ్ చేసి ఇంటికి చేరుకున్నాడు. ఆ తరువాత డ్రైవర్ కి డబ్బులు చెల్లించేందుకు లేపుదామని ప్రయత్నించినా ఫలితం లేదు. దీంతో 500 రూపాయల నోటును డ్రైవర్ ఒళ్లో ఉంచి, ఈ తతంగం అంతా వీడియో తీసి గిల్ ఇంటికి వెళ్లిపోయాడు. ఇలాంటి ప్రయాణాలు ప్రాణాంతకమని చెబుతూ ఈ వీడియోను ఆయన పోస్టు చేయగా, దీనిని వీక్షకులు విశేషంగా చూస్తున్నారు.