: మినీ మహానాడులో మరోసారి ఉద్రిక్తత...తెలుగు తమ్ముళ్ల వీరంగం
ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగుతోన్న మినీ మహానాడులో మరోసారి ఉద్రిక్తత చెలరేగింది. ప్రకాశం జిల్లాలో సుదీర్ఘ కాలంగా శత్రువులుగా కొనసాగుతున్న కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ వర్గీయుల మధ్య నినాదాలతో ప్రారంభమైన ఘర్షణ, వాగ్వాదంగా మారి తోపులాటకు దారితీసింది. గొట్టిపాటి రవి వర్గీయులను వేదికపైకి రావడాన్ని వ్యతిరేకించిన కరణం బలరాం, ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తొలిసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో రంగ ప్రవేశం పార్టీ నేతలు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రావెల కిషోర్ బాబులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం కరణం బలరాం ఆవేశపూరిత వ్యాఖ్యలు చేసినప్పటికీ పరిస్థితి అదుపులోకి వచ్చింది. తరువాత గొట్టిపాటి రవికుమార్ సభికులనుద్దేశించి మాట్లాడే సమయంలో కరణం బలరాం వర్గీయులు అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వారికి దీటుగా గొట్టిపాటి రవి వర్గీయులు కరణం బలరాంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఘర్షణ పెరిగింది. ఓ దశలో ఒకరిపై ఒరకు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో భారీ ఎత్తున మోహరించిన పోలీసులు రెండు వర్గాల వారిని అడ్డుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే, ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు.