: ఏపీకి రాష్ట్రావతరణ దినోత్సవం ఉండదు.. జూన్ 2న నవనిర్మాణ దీక్ష: సీఎం చంద్రబాబు
రాష్ట్ర విభజన జరిగి రెండు సంవత్సరాలు పూర్తికానున్న సందర్భంగా తమకు జరిగిన అన్యాయాన్ని తెలుపుతూ జూన్ 2న నవనిర్మాణ దీక్ష చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కట్టుబట్టలతో వచ్చినందుకు జూన్2 ను మరచిపోలేమని అన్నారు. కాంగ్రెస్ తమకు తీరని అన్యాయాన్ని చేసిందని అన్నారు. తమలో అభివృద్ధి చేయాలన్న కసి, కోపం తగ్గకూడదనే ఆకాంక్షతోనే నవనిర్మాణ దీక్ష చేపడుతున్నామని వ్యాఖ్యానించారు. ఏపీకి రాష్ట్రావతరణ దినోత్సవం ఉండదని, అంకితభావదినోత్సవం మాత్రమే ఉంటుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మనకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూనే, పరిస్థితులను తట్టుకుంటూ నిలదొక్కుకుంటున్నామని, ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈరోజున అంకితభావ దినోత్సవం జరుపుకుందామని చెప్పారు.