: జగన్ జలదీక్షపై దేవినేని ఉమకు కొత్త అనుమానాలు!
ఈ వారం ప్రారంభంలో కర్నూలు వేదికగా వైకాపా అధినేత జగన్ చేసిన జలదీక్షపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమకు కొత్త అనుమానం వచ్చింది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదాలను మరింతగా పెద్దవి చేసి, అశాంతిని పెంచడానికి, వివాదాలు రేపడానికే ఆయన దీక్షలు చేశారని ఉమ వ్యాఖ్యానించారు. రెండేళ్ల నుంచి నీటి వాటాలపై వివాదం జరుగుతుండగా, సరిగ్గా పాలేరు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగే సమయంలోనే ఆయన ఎందుకు దీక్ష చేపట్టాల్సి వచ్చిందని ఉమ ప్రశ్నించారు. పనిలోపనిగా రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ను కూడా వివాదంలోకి తెచ్చారని, ఆ తరువాత హరీశ్ రావు తనకు ఫోన్ చేశారని చెప్పుకొచ్చారు. జగన్ దీక్ష, కేసీఆర్ ప్రోద్బలంతోనే జరుగుతున్న డ్రామాగా ఇది కనిపిస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణలో నీటి ప్రాజెక్టు కాంట్రాక్టులను పొందుతున్న వైకాపా నేతలు, ఇక్కడ మాత్రం ధర్నాలు చేస్తున్నారని ఉమ విమర్శించారు.