: రాజీవ్ గాంధీ 25వ వర్ధంతి... నివాళులు అర్పించిన ప్రణబ్, సోనియా, రాహుల్
మాజీ ప్రధాని, దివంగత రాజీవ్ గాంధీ 25వ వర్ధంతి సందర్భంగా, న్యూఢిల్లీలోని వీర్ భూమి వద్ద పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు, రాజీవ్ సతీమణి సోనియా గాంధీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు జరిగాయి. దేశానికి రాజీవ్ చేసిన సేవలను నేతలు గుర్తు చేసుకున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా రాజీవ్ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఘనంగా జరుపుతున్నారు. గాంధీభవన్ లో జరిగిన కార్యక్రమంలో పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.