: హైదరాబాద్ కు నీరెందుకంటూ గోదావరి పైప్ లైన్ ను పగలకొట్టిన టీడీపీ నేతలు
కరీంనగర్ జిల్లాలో చుక్క మంచినీరు దొరకక ప్రజలు అవస్థలు పడుతుంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ కు నీటిని తరలించడం ఏంటని ఆరోపిస్తూ, సుల్తానాబాద్ మండలం పూసాల సమీపంలో గోదావరి నీటిని తీసుకువెళ్లే పైప్ లైన్ ను తెలుగుదేశం పార్టీ నేతలు పగులగొట్టారు. పైప్ లైన్ నీటిని చెరువులు, కుంటలకు మళ్లించారు. జిల్లా ప్రజలను తెరాస సర్కారు విస్మరించిందని ఈ సందర్భంగా ఆ పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు విజయరామారావు దుయ్యబట్టారు. ఇక్కడున్న చెరువులన్నీ నిండేదాకా చుక్క గోదావరి నీటిని కూడా వెళ్లనీయబోమని ఆయన స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సైతం ఘటనా స్థలిని సందర్శించి వెళ్లిపోయారే తప్ప, నేతలపై ఎటువంటి కేసులూ పెట్టలేదని తెలుస్తోంది. ఈ చర్యతో హైదరాబాద్ కు రావాల్సిన నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.