: రూ. 2,700కు చెక్కులిస్తే మొత్తం రూ. 4.90 లక్షలు నొక్కేసిన ఘనులు!
మీ భవనంలో బ్యాంకు పెడతామంటూ వచ్చి నమ్మబలికిన ఇద్దరు వ్యక్తులు, దరఖాస్తు పేరిట రూ. 3 వేలకు చెక్కులు తీసుకుని వాటి నుంచి రూ. 4.90 లక్షలు నొక్కేసిన ఘటన ఖమ్మంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, పట్టణ పరిధిలోని విజయ్ నగర్ కాలనీలో సత్యనారాయణ అనే వ్యక్తికి మూడంతస్తుల భవంతి ఉండగా, కింద పోర్షన్ ఖాళీగా ఉంది. ఆయన ఇంటికి వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని ఆగంతుకులు, తాము బ్యాంక్ ఆఫ్ పాటియాలా నుంచి వస్తున్నామని, ఇంట్లో బ్యాంకు శాఖను పెడతామని నమ్మించారు. చదరపు మీటరుకు రూ. 40 అద్దె ఇస్తామని డీల్ కుదుర్చుకుని, మీరే దరఖాస్తు చేసుకోవాలని చెప్పి, రూ. 200, రూ. 2,500కు చెక్కులివ్వాలని కోరారు. సత్యనారాయణ, తన భార్య పేరిట ఉన్న రెండు చెక్కులివ్వగా, ఖాతా నుంచి రూ. 4.90 లక్షలు డ్రా అయినట్టు వచ్చిన మెసేజ్ చూసి అవాక్కయ్యాడు. ఆపై ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.