: రెండు వారాల పాటు దేశవ్యాప్త ప్రచారం... రెండేళ్లలో తాము చేసింది చెప్పనున్న బీజేపీ!


ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పాలని బీజేపీ నిర్ణయించింది. రెండు వారాల వ్యవధిలో మంత్రులంతా 200 నగరాలను సందర్శించి బహిరంగ సభల్లో మాట్లాడాలని, ఎంపీలంతా తమతమ నియోజకవర్గాల్లో పర్యటనలు చేయాలని ప్రధాని ఇప్పటికే ఆదేశించారు. వచ్చే గురువారం యూపీలోని షహరన్ పూర్ జరిగే ప్రచార ర్యాలీతో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ ర్యాలీని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభించనున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో తొలిసారిగా అధికారాన్ని దక్కించుకోవడం, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేరళలో తొలి అడుగు వేయడం వంటి విజయాలతో ఆనందంగా ఉన్న బీజేపీ, దేశవ్యాప్తంగా పర్యటనలు జరిపి క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలని భావిస్తోంది. దేశాభివృద్ధి, సుపరిపాలన గురించి ప్రజలకు చెప్పడమే ఈ రెండు వారాల పాటు బీజేపీ ప్రతినిధుల కర్తవ్యమని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న యూపీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన మోదీ, ఈ రాష్ట్రంలో మరిన్ని పర్యటనలు చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 26 నుంచి 33 మంది మంత్రులు పక్షం రోజుల పాటు పర్యటనలు చేయనున్నారని పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. తామిచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నామన్న విషయాన్ని ప్రజలకు తెలియజేప్తామని ఆయన అన్నారు. కాగా, చాలా మంది మంత్రులు తమ వేసవి పర్యటనలను వాయిదా వేసుకుని నగరాలను, పట్టణాలను చుట్టేందుకు ప్రణాళికలను వేసుకున్నారు.

  • Loading...

More Telugu News