: ఇక ఇండియాలో బీజేపీ, కాంగ్రెస్ లు కలిసినా ప్రాంతీయ పార్టీలను గెలిచేది కష్టమే!
భారత రాజకీయాల్లో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ స్థానాన్ని నెమ్మదిగా బీజేపీ ఆక్రమిస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. తాను అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తిరిగి పాగా వేయలేకపోయింది. కేరళ, అసోంలలో అధికారాన్ని కోల్పోయింది. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో మాత్రం స్థానిక పార్టీలకు, అధికారంలో ఉన్న వారికి ప్రజలు పట్టం కట్టారు. ఇక కాంగ్రెస్, బీజేపీలు కలిసినా స్థానిక పార్టీల హవాను అడ్డుకోలేరని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. గడచిన నాలుగేళ్ల వ్యవధిలో జరిగిన 30 రాష్ట్రాల ఎన్నికల్లో ఇదే తేలిందని చెబుతున్నారు. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికలు సహా, 2012 నుంచి 30 మార్లు దేశంలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 4,117 సీట్లకు వివిధ రాజకీయ పార్టీలు పోటీ పడ్డాయి. వీటిల్లో బీజేపీ 1,051 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ 871 సీట్లను గెలుచుకుంది. ఈ రెండు పార్టీలూ కలిపి 1,922 సీట్లను గెలుచుకోగా, ఇతర పార్టీలు 2,195 సీట్లలో గెలిచాయి. వీటిలో అత్యధికం స్థానిక పార్టీలవే. వామపక్షాలు, బీఎస్పీ వంటి కొన్ని జాతీయ పార్టీలు ఉన్నప్పటికీ, వాటి ప్రభావం ఒకటి రెండు రాష్ట్రాల్లో మాత్రమే కనిపిస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ 30 ఎన్నికల్లో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ తో జత కట్టని పార్టీలు 465 స్థానాలను గెలుచుకున్నాయి. ఇక ఇదే సమయంలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయన్న లెక్క చూస్తే, ఈ నాలుగేళ్లలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 12.6 కోట్లు, కాంగ్రెస్ కు 11.8 కోట్లు, ఇతర పార్టీలకు 33.5 కోట్ల ఓట్లు వచ్చాయి. అంటే రెండు అతిపెద్ద పార్టీలకు 42 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా, మిగిలిన 58 శాతం ఓట్లలో కొన్ని బీజేపీ లేదా కాంగ్రెస్ తో జతకట్టిన సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్, తృణమూల్ కాంగ్రెస్, బిజు జనతాదళ్, ఏఐఏడీఎంకే తదితర పార్టీలకు వచ్చాయి. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలను పరిశీలిస్తే, బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ అధిక స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ కు 115 సీట్లు లభించగా, బీజేపీ 64 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇతర పార్టీలకు 643 సీట్లు లభించగా, అందులో ఈ రెండు పార్టీలతో జతకట్టని పార్టీలకు 465 సీట్లు లభించడం గమనార్హం.