: తుపాకితో సంచరిస్తున్న వ్యక్తిపై వైట్ హౌస్ భద్రతా సిబ్బంది కాల్పులు!
అమెరికా అధ్యక్ష నివాసం వైట్ హౌస్ ముందు యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజంట్ల తుపాకులు గర్జించాయి. నాలుగంచెల భద్రత ఉండే వైట్ హౌస్ సమీపంలోకి తుపాకి ధరించిన వ్యక్తి రాగా, అతన్ని లొంగిపోవాలని ఎంతగా చెప్పినా వినకపోవడంతో, అతనిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో ముందు జాగ్రత్త చర్యగా వైట్ హౌస్ ను తాత్కాలికంగా షట్ డౌన్ చేయాల్సి వచ్చిందని వివరించారు. అక్కడి కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి వైట్ హౌస్ దక్షిణ భాగంలోని ఈ స్ట్రీట్ వద్దకు తుపాకితో రాగా, దాన్ని కిందపడేసి లొంగిపోవాలని సెక్యూరిటీ సిబ్బంది కోరారు. గన్ కింద పడేసేందుకు అతను నిరాకరించాడని, దీంతో కాల్పులు జరిపి, ఆపై అతన్ని ఆసుపత్రికి తరలించామని వైట్ హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది. అతన్ని 26 ఏళ్ల బ్రెట్ పొలివ్కాగా గుర్తించామని, టెక్సాస్ కు చెందిన వాడని తెలిపింది.