: ప్రమాదం అంచున ముంబై, కోల్ కతా... భవిష్యత్తులో 4 కోట్ల మందికి రిస్క్: ఐరాస నివేదిక
సముద్ర మట్టాలు పెరగడం కారణంగా భవిష్యత్తులో ముంబై, కోల్ కతా నగరాలు పెను ప్రమాదాన్ని ఎదుర్కోనున్నాయని, దాదాపు 4 కోట్ల మంది జీవితాలు రిస్క్ లో పడతాయని ఐక్యరాజ్యసమితి పర్యావరణ నివేదిక హెచ్చరించింది. జియో-6 (గ్లోబల్ ఎన్విరాన్ మెంటల్ ఔట్ లుక్ - 6వ ఎడిషన్) విడుదల కాగా, పసిఫిక్ మహా సముద్రాన్ని ఆనుకుని ఉన్న దేశాలతో పాటు దక్షిణాసియా దేశాలూ ప్రమాదంలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. 2050 నాటికి ఆసియా పసిఫిక్ రీజియన్ లో 10 దేశాలు ప్రమాదపు అంచుకు వెళతాయని తెలిపింది. ఇండియాలో 4 కోట్ల మంది, బంగ్లాదేశ్ లో 2.5 కోట్ల మంది చైనాలో 2 కోట్ల మంది, ఫిలిప్పైన్స్ లో 1.5 కోట్ల మంది తమ ప్రాంతాలను వదిలి వెళ్లాల్సి వస్తుందని పేర్కొంది. చాలా తీర ప్రాంత నగరాలు శరవేగంగా విస్తరిస్తున్నాయని, ఇక్కడి వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయని వెల్లడించిన ఈ నివేదిక, చైనా, ఇండియా, థాయ్ ల్యాండ్ వంటి కొన్ని దేశాల్లో జరుగుతున్న పట్టణీకరణ, పెరుగుతున్న కాలుష్యం సముద్ర జలాలు ముందుకు వచ్చేందుకు కారణమవుతున్నాయని పేర్కొంది. ఇండియాలో ముంబై, కోల్ కతాలతో పాటు చైనాలోని షాంగై, గువంజోవు, బంగ్లాదేశ్ లోని ఢాకా, మయన్మార్ లోని యాంగాన్, థాయ్ ల్యాండ్ లోని బ్యాంకాక్, వియత్నాంలోని హోచి మిన్హ్, హై ఫోంగ్ నగరాలను పూర్తిగా ఖాళీ చేయాల్సిన పరిస్థితి 2070 నాటికి వస్తుందని అంచనా వేసింది.