: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు పోటీగా రంజిత్ సేథీని తెచ్చి సక్సెస్ అయిన బీజేపీ!
ప్రశాంత్ కిషోర్... నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కేంద్రంలో అధికారం చేపట్టడానికి కారణమైన ప్రధాన వ్యక్తుల్లో ఒకరు. టెక్నాలజీని వినియోగించుకుని ఆయన చేసిన ప్రచారం మోదీని పీఎం పీఠానికి దగ్గర చేసింది. తిరిగి ఆయన చేసిన కృషి, బీహార్ లో నితీష్ ను ముఖ్యమంత్రిగా చేసింది. ఇప్పుడాయన కాంగ్రెస్ వైపు మళ్లడంతో, ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం, అభ్యర్థుల గెలుపోటములపై ముందస్తు సర్వేలను నిర్వహించేందుకు బీజేపీ ఓ యువకుడిని నమ్ముకుంది. అసోంలో బీజేపీ అధికారంలోకి రావడానికి, కేరళలో తొలిసారి పాగా వేసి ఓట్ల శాతాన్ని 200 శాతం పెంచుకోగలగడానికి అతను చేసిన కృషే కారణమట. ఆయనే రజత్ సేథి! 30 సంవత్సరాల ఈ యువకుడు ఐఐటీ, ఎంఐటీ, హార్వార్డ్ యూనివర్శిటీలలో విద్యను అభ్యసించారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఏరికోరి రజత్ సేథీని రంగంలోకి దించారని సమాచారం. ఇప్పుడాయన పేరు భారత రాజకీయ వర్గాల్లో మారుమోగుతోంది. మరో ప్రశాంత్ కిశోర్ గా నిపుణులు అభివర్ణిస్తుంటే, తనను ఆయనతో పోల్చవద్దని రజత్ చెబుతున్నారు. తన పని విధానం వేరని స్పష్టం చేస్తున్నారు. "నా మనోభావాలతో బీజేపీ దగ్గరగా ఉన్న కారణంగానే నేను బీజేపీకి సహకరించాను. ఆ పార్టీ కార్యదర్శి రాం మాధవ్ కోరిక మేరకు ఢిల్లీ నుంచి గౌహతికి మకాం మార్చి అక్కడి నుంచే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాం. రాష్ట్ర యువతకు దగ్గరయ్యేందుకు టెక్నాలజీని వినియోగించుకున్నాం" అని ఆయన అన్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ల ద్వారా నరేంద్ర మోదీ విధానాలను ప్రచారం చేయడం అసోంలో బీజేపీకి కలిసి వచ్చింది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లోని ఉద్యోగులు, యువత ఫోన్ నంబర్లు సేకరించిన రజత్ నేతృత్వంలోని బృందం ఎన్నికలకు ఎన్నో రోజుల ముందు నుంచే వారికి బీజేపీ గురించి వివరిస్తూ, ఓట్ల సంఖ్య పెరిగేలా చూసుకుంది. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ, ఓటర్ల నాడిని పరిశీలిస్తూ, అందుకు తగ్గట్టుగా వ్యూహాలను మారుస్తూ ముందుకు సాగగా, ఆ పార్టీ ఇప్పుడు అసోంలో తొలిసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. తాను ఓ టీమ్ లో భాగంగానే పనిచేశానని, శర్వానంద సోనోవాల్ తమకెంతో సహకరించారని రజత్ వ్యాఖ్యానించారు.