: మరో వెయ్యి సంవత్సరాల వరకు ఇండియాలో మా ‘యాపిల్’ ఉంటుంది: టిమ్ కుక్
మరో వెయ్యి సంవత్సరాల వరకు ఇండియాలో తమ యాపిల్ సంస్థ ఉంటుందని ఆ కంపెనీ సీఈవో టిమ్ కుక్ వ్యాఖ్యానించారు. భారత్‌లో తొలిసారి పర్యటిస్తోన్న టిమ్ కుక్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఓ జాతీయ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు పంచుకున్నారు. ‘ఇండియా మంచి లక్ష్యాలతో, టెక్నాలజీ పట్ల ఆసక్తితో వ్యూహాత్మకంగా ఉంది. ఇక్కడ మేము సుదీర్ఘమైన ఇన్నింగ్స్‌నే కొనసాగిస్తాం’ అని వ్యాఖ్యానించారు. ‘మరో వెయ్యేళ్లు ఇక్కడ ఉంటాం, అత్యుత్తమ సేవలను అందిస్తాం’ అని ఆయన అన్నారు. తాము గర్వంగా చెప్పుకోవడానికి వీల్లేని ప్రోడక్ట్‌లను తామెన్నడూ తయారు చేయబోమని చెప్పారు. యాపిల్ మార్కెటింగ్‌కి ఇండియాలో మంచి భవిష్యత్తు ఉందని టిమ్ కుక్ పేర్కొన్నారు. చైనాను గురించి ప్రస్తావిస్తూ ఇండియా చైనా కన్నా విభిన్నమైనదని వ్యాఖ్యానించారు. బెంగుళూరులో తమ సంస్థ యాప్స్ డెవలప్ మెంట్ సెంటర్ సౌలభ్యం తేవడం, హైదరాబాద్‌లో మ్యాప్స్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం అన్నది ఇండియాలో తమ తొలి అడుగు మాత్రమే అని ఆయన అన్నారు. పక్కింటివాళ్లు బాగుంది అని చెప్పే అవసరమే లేదు.. యాపిల్ ప్రోడక్ట్‌ల నాణ్యత గురించి ప్రపంచమే కోడై కూస్తోందని ఆయన పేర్కొన్నారు.