: ఢిల్లీ డేర్ డెవిల్స్ కి చావో రేవో తేలేది నేడే!
ఢిల్లీ డేర్ డెవిల్స్ కి చావో రేవో నేడు తేలిపోనుంది. సన్ రైజర్స్ హైదరాబాదు, కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ హైదరాబాదు, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్ తో పాటు ఢిల్లీ డేర్ డెవిల్స్ కూడా ప్లేఆఫ్ రేసులో నిలిచాయి. అయితే ప్లే ఆఫ్ లో నాలుగు జట్లు మాత్రమే ఆడే అవకాశం ఉండడంతో ఏ జట్లు చేరుతాయని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాదు, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండడంతో ఆ రెండు జట్లు ఆడడం ఇంచుమించు ఖరారైనట్టే. మిగిలిన రెండు స్థానాల కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాదుతో నేడు జరగనున్న మ్యాచ్ లో ఢిల్లీ జట్టు విజయం సాధించాల్సిందే. విజయం సాధిస్తేనే ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. లేని పక్షంలో మిగిలిన మూడు జట్లలో రెండు జట్లు మాత్రమే ప్లేఆఫ్ కు చేరుతాయి. కాగా, సన్ రైజర్స్ జట్టు ఈ టోర్నీ ఆరంభం నుంచి ఒకే రకమైన ఆటతీరు ప్రదర్శిస్తోంది. అయితే, ఇకపై ఆ జట్టు కీలక బౌలర్ నెహ్రా ఆడే అవకాశం లేకపోవడం ఆ జట్టుకు ఇబ్బందే. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ప్రారంభంలో అద్భుతమైన ఆటతీరుతో దూసుకుపోయింది. టోర్నీ కీలక దశకు చేరుకుంటున్న క్రమంలో అకారణంగా ఆ జట్టు డీలా పడింది. పుంజుకోవాలంటే ఈ మ్యాచ్ లో ఉత్తమప్రదర్శన ఇవ్వాల్సి ఉంది.