: మరోసారి దుమ్మెత్తిపోసుకున్న అమెరికా ‘అధ్యక్ష’ పోటీ అభ్యర్థులు


డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల తరఫున అమెరికా అధ్యక్ష స్థానానికి అభ్యర్థులుగా ప్రచారంలో ముందు వరసలో ఉన్న హిల్లరీ క్లింటన్ (డెమొక్రటిక్), డొనాల్డ్ ట్రంప్ (రిపబ్లికన్) మరోసారి తీవ్రంగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. అమెరికా అధ్యక్ష స్థానానికి ట్రంప్ తగిన వాడు కాదని హిల్లరీ క్లింటన్ అన్నారు. ట్రంప్ సామర్థ్యాలపై పలు ప్రశ్నలు సంధించారు. బాధ్యతారహిత, నిర్లక్ష్య, ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ కు సంక్లిష్టమైన విదేశీ విధానాల పరంగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేటంత సత్తా లేదన్నారు. గ్రేట్ బ్రిటన్ ను నిందించడం, అమెరికాపై క్షిపణులు ఎక్కుపెడతానని హెచ్చరిస్తున్న ఉత్తరకొరియా నేతను ప్రశంసించడం, నాటోలో అమెరికా సభ్యత్వాన్ని ప్రశ్నించడం తదితర సంఘటనలను హిల్లరీ ఉదాహరణలుగా పేర్కొన్నారు. అయితే, హిల్లరీ ఆరోపణలపై ట్రంప్ మౌనంగా ఉండిపోలేదు. కష్టకాలంలో ఉన్న అమెరికాకు అధ్యక్ష అభ్యర్థిగా హిల్లరీ సరిపోరని వ్యాఖ్యానించారు. అంతేకాదు, హిల్లరీ భర్త, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఓ రేపిస్ట్ అని ఆరోపించారు. తనకు ప్రధాన ప్రత్యర్థిగా హిల్లరీయేనన్న విషయం గ్రహించిన దగ్గర్నుంచీ ట్రంప్ ఆమె భర్తను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఒబామాను సైతం ట్రంప్ విడిచిపెట్టలేదు. అమెరికా స్థాయిని చైనా ముందు డెవలపింగ్ కంట్రీగా (అభివృద్ధి చెందుతున్న దేశంగా) మార్చాడని అన్నారు. ఆయన్నొక అవివేకిగా ట్రంప్ పోల్చారు.

  • Loading...

More Telugu News