: వైసీపీకి మరో ఎదురుదెబ్బ!... ఆసుపత్రి అభివృద్ధి కమిటీలపై రోజా, ఆళ్ల పిటిషన్ల కొట్టివేత!
ఏపీలో విపక్షం వైసీపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ చేసిన పలు వాదనలను కోర్టులు కొట్టివేశాయి. తాజాగా ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి కమిటీల్లో తమకు చోటు కల్పించకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలన్న ఆ పార్టీ ఎమ్మెల్యేల వాదనలను తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నిన్న కొట్టివేసింది. ఈ విషయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వేణుగోపాల్ వినిపించిన వాదనతో ఏకీభవించిన ధర్మాసనం వైసీపీ ఎమ్మెల్యేల పిటిషన్లను డిస్మిస్ చేసింది. అప్పటిదాకా ఆసుపత్రి అభివృద్ధి కమిటీల్లో ఎమ్మెల్యేలకు సభ్యత్వం ఉండగా, చంద్రబాబు సర్కారు దానిని రద్దు చేస్తూ జీవో జారీ చేసిందని వైసీపీ ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆదినారాయణరెడ్డి (అప్పటికింకా వైసీపీలోనే ఉన్నారు) వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిలుపుదల చేయాలని కోర్టును కోరారు. ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రజా ప్రతినిధులు తమ బిజీ షెడ్యూల్ కారణంగా ఆసుపత్రుల అభివృద్ధి కమిటీ సమావేశాలకు హాజరుకాలేరని, ఈ కారణంగా పలు కార్యక్రమాలు ఆలస్యమవుతాయన్న భావనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం ఒక్క విపక్ష ఎమ్మెల్యేలనే కాకుండా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కూడా సదరు కమిటీలకు దూరంగా ఉంచిందని తెలిపారు. దీంతో కోర్టు వైసీపీ ఎమ్మెల్యేల పిటిషన్లను కొట్టేసింది.