: విజయం కావాలా?...ఈ మూడూ చేయండి...భారత యువతకు టిమ్ కుక్ సలహా
జీవితంలో, చేస్తున్న పనిలో విజయం కావాలా? అయితే మూడు విషయాలను మర్చిపోవద్దని భారతీయ యువతకు యాపిల్ సీఈవో టిమ్ కుక్ సూచించారు. మీకేం చేయాలనిపిస్తే అది చేయండి, హద్దులు నిర్ణయించుకోకండి. తరువాత, మీరు చేసేదాని కోసం వంద శాతం కష్టపడండి, వెంటనే ఫలితం ఆశించకండి, నిజాయతీగా కష్టపడితే విజయం వస్తుంది. చివరిగా మిమ్మల్ని మీరు పూర్తిగా నమ్మండి, ఇది చాలా అవసరం అని ఆయన చెప్పారు. కాన్పూర్ లో గుజరాత్ లయన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ టీ20 మ్యాచ్ వీక్షించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంత వేడి ఉష్ణోగ్రతలో క్రికెట్ మ్యాచ్ ను వీక్షించడం చాలా కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ ఆటను భారతీయులు ప్రేమించిన విధానం నచ్చిందని తెలిపారు. ఇంత వేడిలో ఇంత మంది ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ కలవడం అద్భుతమైన అనుభవమని అన్నారు. ఇలాంటి అనుభవం తానెప్పుడూ చవిచూడలేదని, ఈ అనుభవం చాలా బాగుందని ఆయన చెప్పారు. భారత్ లో అపారమైన అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. వీటిని యాపిల్ అందిపుచ్చుకుంటుందని ఆయన వెల్లడించారు. భారతీయ యువతలో చాలా టాలెంట్ ఉందని చెప్పిన ఆయన, వారిని సరైన రీతిలో ఉపయోగించుకోవాలని అన్నారు.