: తమిళ ప్రజలు తమ మనసులను ఒక దెయ్యానికి అమ్మేసుకున్నారు: డీఎంకే నేత దయానిధి మారన్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ పరాజయం పాలవడం ఆ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ కు మింగుడు పడటం లేదు. ఈ నేపథ్యంలో అన్నా డీఎంకే అధినేత్రి జయలలితపై, తమిళ ప్రజలపై ఆరోపణలు గుప్పించిన ఆయన చులకన అయ్యారు. డీఎంకేకు విజయం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన అనంతరం ఓటర్లకు అన్నాడీఎంకే వారు భారీగా డబ్బులు పంచిపెట్టారని ఆరోపించారు. తమిళ ప్రజలు తమ మనసులను ఒక దెయ్యానికి అమ్మేసుకున్నారంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే, దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆయన ఆరోపణల్లో అర్థం లేదంటూ కొట్టిపారేశారు. ఎన్నికలు అయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వస్తాయని, అప్పటికే ఓటర్లు ఓటు వేసేసి ఉంటారనే విషయం మారన్ కు తెలియదా? ఈవీఎంలలో ఉన్న ఓట్లను వారెలా మార్చగలరు? అంటూ వారు ప్రశ్నించారు. అయితే, మారన్ వ్యాఖ్యలపై మరికొందరేమంటున్నారంటే.. ఒపీనియన్ పోల్స్ అనబోయి ఎగ్జిట్ పోల్స్ అన్నాడేమో అంటూ ఆయన వ్యాఖ్యలకు కవరింగ్ ఇస్తున్నారు.