: పాపం 'కెప్టెన్'... యాగాలు కూడా కలిసి రాలేదు...డిపాజిట్ గల్లంతు!
కొత్త ముఖ్యమంత్రిని తానేనని ఎన్నో ఆశలు పెట్టుకున్న 'కెప్టెన్' విజయకాంత్ తాజా ఫలితాలతో హతాశుడయ్యారు. కింగ్ మేకర్ని తానేనని, తనకు ఎవరు ముఖ్యమంత్రి పీఠం ఇస్తారో వారి వెంటే ఉంటానని ఎన్నికలకు ముందు భీష్మించుకుని కూర్చున్న 'కెప్టెన్' ఫలితాలు వెల్లడయ్యాక కుదేలయ్యారు. 'అమ్మ' హవాలో డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. జయలలితను విభేదించిన విజయకాంత్, మీడియాతో దురుసు ప్రవర్తన, సెక్యూరిటీపై చేయి చేసుకోవడం, పలు బహిరంగ సభల్లో రజనీకాంత్ ను కించపరిచేలా పంచ్ డైలాగులు వేయడంతో ప్రజల్లో చులకనైపోయారు. ఎన్నికలకు ముందు రహస్య యాగాలు చేయించిన విజయకాంత్, కాబోయే ముఖ్యమంత్రిని తానేనని పలు లెక్కలు సరిచూసుకుని, రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో పాల్గొన్నారు. తమిళనాట లీడింగ్ పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలను కాదని ప్రజా సంక్షేమ కూటమి (పీబ్ల్యూఎఫ్)లో చేరి సత్తాచాటుదామని భావించి, చివరకు బొక్కబోర్లా పడ్డారు. ఉలందూరుపేట నుంచి పోటీ చేసిన 'కెప్టెన్' అన్నాడీఎంకే చేతిలో చిత్తుగా ఓడిపోయి, డిపాజిట్ కూడా కోల్పోయి మూడో స్థానంలో నిలిచారు. 2011లో రిషివాందియమ్, 2006లో విరుదాచలం నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన మూడోసారి ఘోర పరాభవానికి గురయ్యారు.