: జయలలిత విజయంతో సోషల్ మీడియాలో రేగిన ప్రశ్న
32 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సారథ్యంలో అన్నాడీఎంకే వరుసగా రెండోసారి విజయం సాధించింది. దీంతో తమిళనాట సంబరాలు మిన్నంటాయి. జయలలిత అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో జయలలిత వీరాభిమానులంతా పొయెస్ గార్డెన్ కు క్యూకట్టారు. అక్కడ వీఐపీ, వీవీఐపీలకు మాత్రమే పురచ్చితలైవి దర్శనం దొరికింది. విజయం సాధించిన ఆనందంలో వీఐపీ, వీవీఐపీలంతా అమ్మకాళ్లకు సాష్టాంగ నమస్కారాలు చేయడం పెను దుమారం రేపుతోంది. అభిమానం హద్దులు దాటే తమిళనాట ఇది సాధారణమే అని అంటున్నప్పటికీ, బానిసత్వానికి ఆ సాష్టాంగ ప్రణామం సాక్ష్యమని సోషల్ మీడియాలో పలువురు మండిపడుతున్నారు. అలా కాళ్లకు నమస్కరిస్తున్న వారిని జయలలిత కనీసం వారించకపోవడంపై సోషల్ మీడియాలో ఓ చర్చ నడుస్తోంది. ఇదేం సంప్రదాయమని పలువురు ప్రశ్నిస్తున్నారు. తమిళులకు ప్రేమవచ్చినా, ద్వేషం వచ్చినా తట్టుకోవడం కష్టమని మరికొందరు పేర్కొంటున్నారు.