: కాశ్మీరు నుంచి కేరళ దాకా, గుజరాత్ నుంచి అసోం దాకా... బీజేపీ ఇక దేశమంతా విస్తరించిన పార్టీ


ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించిన పార్టీగా కాంగ్రెస్ తో సమానంగా నిలిపాయి. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో అధికారాన్ని దక్కించుకోవడం బీజేపీ సాధించిన అతిపెద్ద విజయం కాగా, కేరళలో పాగా వేయడం ఆ పార్టీ భవిష్యత్ కు కలిసొచ్చే అంశం. ఈ ఎన్నికలతో అటు కాశ్మీరు నుంచి కేరళకు, ఇటు గుజరాత్ నుంచి అసోం వరకూ విస్తరించిన పార్టీగా బీజేపీ నిలిచింది. వాస్తవానికి అసోంలో సైతం బీజేపీ ఇంత ఘన విజయాన్ని ఊహించి వుండకపోవచ్చు. ఆ పార్టీ ఏకంగా 30.3 శాతం ఓట్ షేర్ (2011లో 11.47 శాతం) సాధించగా, 2011లో ఉన్న 5 అసెంబ్లీ సీట్లు ఇప్పుడు 56కు పెరిగాయి. దీనికితోడు కేరళలో గెలుచుకున్నది ఒక్క సీటే అయినా, 10.8 శాతం ఓట్లను (2011లో ఆరు శాతం) పొందడం ఆ పార్టీ మనోబలాన్ని మరింతగా పెంచుతుంది. ఇక పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే, తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించినప్పటికీ, 10.2 శాతం ఓట్లను (2011 ఎన్నికల్లో 5 శాతం) బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. రెండేళ్ల పాలన పూర్తవుతున్న వేళ, మోదీ సర్కారుకు ఈ ఎన్నికల ఫలితాలు మిఠాయిల వంటివే. జీఎస్టీ వంటి కీలక సంస్కరణల విషయంలో ముందడుగు వేసే ధైర్యాన్ని సైతం ఫలితాలు బీజేపీకి అందించాయని, ఈ ఉత్సాహాన్ని వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వరకూ కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీ నాయకత్వానిదేనని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News