: ఆ ఇద్దరు ఉద్దండులకు 90 ఏళ్లు నిండినా వారిలో పోరాట పటిమ మాత్రం తగ్గలేదు!


వివిధ రంగాల్లో మార్పులు చోటుచేసుకున్నట్టే రాజకీయాల్లో కూడా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. విలువలకు కట్టుబడ్డ నేతలు కనిపించడం అరుదుగా జరుగుతోంది. తమకు 70 ఏళ్లు దాటితే వారసులను రంగంలోకి దించి విశ్రాంతి తీసుకుంటున్న ప్రస్తుత తరుణంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, కేరళ కాబోయే ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. 90 ఏళ్లు నిండిన ఈ ఇద్దరు రాజకీయదురంధరులు ఓటమిని అంత సులువుగా అంగీకరించే మనస్తత్వం కలిగినవారు కాదని వారి రాజకీయ జీవితం చెబుతోంది. 90 ఏళ్లు పైబడిన వయసులో యువకులతో సమానంగా పోటీపడి మరీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రయత్నంలో కరుణానిధి పార్టీ ఫలితం సంగతి పక్కనపెడితే... ఆయన వ్యక్తిగతంగా తన నియోజక వర్గం నుంచి విజయం సాధించారు. ఇక వీఎస్ అచ్యుతానందన్ మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేందుకు సిద్ధమవుతుండగా, జయలలిత ధాటికి కరుణానిధి ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. ముదిమి వయసులో ఉత్సాహంగా ఆయా రాష్ట్రాల రాజకీయాలను శాసిస్తున్న వీరిద్దరి స్థైర్యానికి అంతా అభినందనలు చెబుతున్నారు. తమిళనాట డీఎంకే ప్రచార బాధ్యతలన్నీ కరుణానిధి తలకెత్తుకోగా, గతంలో తెలుగు రాష్ట్రాలను చూసి ఈ పార్టీ ప్రకటించిన రైతు రుణమాఫీ పథకం పట్ల తమిళ రైతులు అంతగా ఆకర్షితులు కానట్టు తెలుస్తోంది. ఇక జయలలిత తన ప్రజాకర్షక పథకాలనే నమ్ముకున్నారు. సాంబారు ఇడ్లీ పథకం, మహిళలకు ఉచిత మిక్సర్, గ్రైండర్ పథకంతో పాటు మహిళలు స్కూటీ కొనుక్కుంటే అందులో సగం ప్రభుత్వం భరించే స్కీము, దాంతో పాటు రుణమాఫీ కూడా జయకు దండిగా మహిళా ఓట్లు పడేలా చేసి, డీఎంకేను ఇంకొంత దెబ్బతీసింది. కేరళలో అచ్యుతానందన్ వామపక్ష పార్టీల బాధ్యతలు తలకెత్తుకుని, నిజాయతీనే ప్రచారాస్త్రంగా ఉపయోగించి విజయం సాధించడం విశేషం. భవిష్యత్తు రాజకీయాలలో ఇలాంటి పోరాట యోధులను భారత దేశం చూస్తుందా? అనే సందేహాలు కూడా తలెత్తుతాయి. వచ్చే ఎన్నికల నాటికి ఈ ఇద్దరూ రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశం కనిపిస్తుండగా, చివరి ఎన్నికల్లో ఇద్దరూ శక్తియుక్తులు ధారపోయడం విశేషం.

  • Loading...

More Telugu News