: నా ఆనందం గురించి చెప్పేందుకు ఏ డిక్షనరీలోను మాటలు లేవు: జయలలిత
మూడు దశాబ్దాల తరువాత అధికారంలో ఉన్న పార్టీని ప్రజలు తిరిగి ఎన్నుకోవడం తనపై బాధ్యతను మరింతగా పెంచిందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆమె, ఈ విజయం గురించి తన మనసులోని అభిప్రాయాలను చెప్పేందుకు ఏ డిక్షనరీలోనూ మాటలు లేవని అన్నారు. తానంత ఆనందంగా ఉన్నానని, మ్యానిఫెస్టోలో భాగంగా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలనూ నెరవేరుస్తానని స్పష్టం చేశారు. తనకు అండగా నిలబడిన కోట్లాది మంది తమిళ ప్రజలకు, సహచర మంత్రులకు, కార్యకర్తలకు అనునిత్యం అందుబాటులో ఉంటానని, సమస్యలు తీర్చేందుకు పునరంకితమవుతానని జయలలిత తెలిపారు. కాగా, జయలలిత నివాసం వద్ద వేలాది మంది కార్యకర్తలు సంబరాలు చేసుకుంటుండగా, పరిమిత సంఖ్యలో అన్నాడీఎంకే నేతలు, మంత్రులకు మాత్రమే ఇంట్లోకి వెళ్లేందుకు భద్రతాధికారులు అనుమతినిస్తున్నారు.