: మోదీ నినాదం 'కాంగ్రెస్ విముక్త భారత్'కు మరో రెండు అడుగులు దగ్గర పడ్డాయ్!


కాంగ్రెస్ విముక్త భారతం... ప్రదాని నరేంద్ర మోదీ 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన పిలుపు ఇది. కాంగ్రెస్ లేని భారతదేశాన్ని ఆయన కోరుకుంటుండగా... ఆ దిశగా మరో రెండు అడుగులు ముందుకు పడ్డాయి. కాంగ్రెస్ ఖాతా నుంచి రెండు రాష్ట్రాలు చేజారిపోయాయి. అయితే, పుదుచ్చేరిలో అధికారాన్ని సొంతం చేసుకుంటే ఈ నష్టం ఒక్కటితోనే ఆగిపోతుంది. పుదుచ్చేరిని కూడా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటే ఇక హస్తం గూటిలో పుదుచ్చేరి, కర్ణాటక, మణిపూర్, మేఘాలయ, మిజోరామ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మాత్రమే మిగులుతాయి. కేంద్రంలో దశాబ్దాలుగా తిరుగులేని అధికారాన్ని చలాయించిన కాంగ్రెస్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభ స్థితిని ఎదుర్కుంటోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కేంద్రంలో అధికారాన్ని కోల్పోయిన అనంతరం వివిధ రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఆ పార్టీ పుంజుకోలేకపోతోంది. బీహార్, మహారాష్ట్ర ఎన్నికల్లో చతికిలబడింది. మహారాష్ట్రలో అధికారాన్ని బీజేపీకి చేజార్చుకుంది. తమకు కంచుకోటగా ఉన్న అసోంను కూడా కమలదళానికి సమర్పించుకుంది. కేరళలో శ్రమకోర్చినా అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఇక తమిళనాడులో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. పశ్చిమబెంగాల్ లో కేవలం కొన్ని సీట్లను మాత్రం తెచ్చుకుని మూడో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ ముందున్న తక్షణ సవాలు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు. కేంద్రంలో అధికారం దక్కించుకోవడానికి కీలకమైన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంత సత్తా చూపుతుందన్నదే ఆ పార్టీ భవిష్యత్తును నిర్దేశిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. యూపీకి వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News