: మాపై ఆరోపణలు చేస్తే కేసులు పెడతాం.. ఇక ఊరుకోబోం: తెలంగాణ సీఎం కేసీఆర్
తాము తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలు తమపై అర్థరహిత ఆరోపణలు చేస్తూనే ఉన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. పాలేరు ఉప ఎన్నికలో తమ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఘనవిజయం సాధించిన సందర్భంగా ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలు అర్థరహిత ఆరోపణలు చేస్తే ఇకపై ఊరుకోబోమని, కేసులు పెడతామని అన్నారు. పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. అనవసర రాద్ధాంతాలు, విమర్శలు మానుకోవాలని సూచించారు. ‘ప్రతి పక్షాలకో మాట చెప్పాలి, ప్రభుత్వం మీద పోరాటం చేయడం తప్పు.. ప్రజా సమస్యల మీద పోరాడండి. కొన్ని సందర్భాలలో టీఆర్ఎస్ పై పలు ఆరోపణలు చేస్తున్నారు. దేశ ప్రధానితో పాటు పలు సంస్థలు కూడా మా ప్రభుత్వాన్ని అవినీతి రహిత సర్కార్ అంటూ కితాబిచ్చాయి. ప్రభుత్వం ఏ పని మొదలు పెట్టినా అవినీతి, అవినీతి అని ప్రతిపక్షాలు అంటున్నాయి. మిషన్ కాకతీయను కమీషన్ల కాకతీయ అంటున్నారు’ అంటూ కేసీఆర్ దుయ్యబట్టారు. ‘పాలేరు ఎన్నికల సందర్భంగా ప్రజలను అవమానపరచే విధంగా కాంగ్రెస్ ప్రవర్తించింది. జిల్లా కలెక్టర్‌ని, ఎస్పీని మార్చేయాలని డిమాండ్ చేసింది. ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం ఎన్నికల సంఘం 'ది బెస్ట్ కలెకర్ట్' అంటూ జిల్లా కలెక్టర్ లోకేశ్ కుమార్ కు అవార్డు నిచ్చింది, అటువంటి అధికారిపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పించారు. ప్రజల ఓట్లను పరిహాసం చేసే విధంగా కాంగ్రెస్ మాట్లాడింది. అయినా వారు సాధించిందేమీ లేదు’ అని అన్నారు.