: 4,500 ఓట్ల నుంచి 94 వేల ఓట్లకు పెరిగిన తెరాస బలం... ఉద్యమ ఖిల్లా వాసులు సైతం జేజేలు!
వామపక్షాలకు పెట్టని కోటగా, దశాబ్దాలుగా ఎర్రదండు చేతుల్లో ఉన్న ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ప్రజలు మారిపోయారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 4,500 ఓట్లు మాత్రమే టీఆర్ఎస్ పార్టీకి పడగా, తాజా ఉప ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ పడ్డ అభ్యర్థి తుమ్మలకు ఏకంగా 94,978 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ నేత రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో ఉప ఎన్నిక జరుగగా, ఆ పార్టీ తరఫున వెంకట్ రెడ్డి సతీమణి సుచరితా రెడ్డి పోటీపడ్డ సంగతి తెలిసిందే. ఆమెకు కేవలం 49,302 ఓట్లు రాగా, వామపక్షాల తరఫున బరిలోకి దిగిన పోతినేని సుదర్శన్ కు 15,544 ఓట్లు వచ్చాయి. దీంతో 45 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో తుమ్మల విజయం సాధించారు. ఈ ఎన్నికల ఫలితాల తరువాత టీఆర్ఎస్ విజయపరంపర కొనసాగగా, కాంగ్రెస్, వామపక్షాలకు మాత్రమే మద్దతిస్తూ వచ్చిన పాలేరు ప్రజలిప్పుడు గంపగుత్తగా టీఆర్ఎస్ కు మద్దతిచ్చినట్లయింది. ఇక సానుభూతి ఓట్లను ప్రజలు వేయబోరని తెలంగాణలో రెండోసారి తేటతెల్లమైంది.