: అసోంలో బీజేపీ విజయం చారిత్రాత్మకం: ప్రధాని మోదీ
అసోంలో బీజేపీ విజయం ఏ విధంగా చూసుకున్నా చారిత్రాత్మకం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. అసోంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటున్నట్టు ఫలితాలు వెల్లడి కావడంతో ప్రధాని బీజేపీ కార్యకర్తలు, నాయకుల కృషిని మోదీ ట్వీట్ ద్వారా అభినందించారు. అసోం ప్రజల కలలు, కోర్కెలను నెరవేర్చడానికి శతథా ప్రయత్నిస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కొత్త శిఖరాలకు తీసుకువెళతామని చెప్పారు. అలాగే, అసోంలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన సర్బానంద్ సోనోవాల్ కు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ కాల్ చేసి అభినందించారు. అసోం ఎన్నికల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తల పనితీరును, ప్రచారం కోసం చేసిన కృషిని మెచ్చుకున్నట్టు మోదీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అలాగే, కేరళలో బీజేపీ నిర్మాణం కోసం కష్టించిన ప్రతి కార్యకర్తకు సెల్యూట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇటుక, ఇటుక నిర్మించారని దాని ఫలితమే నేడు కేరళలో బీజేపీ ఈ స్థాయిలో నిలిచిందన్నారు. భవిష్యత్తులో తాము బలమైన ప్రజావాణిగా మారుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.