: ఇంకా కనిపించని 'అమ్మ'.. పూర్తి ఫలితాల వెల్లడి తర్వాతే దర్శనం!
చెన్నైలో రెండోసారి అధికారం చేపట్టనున్న అమ్మ, 16వ తేదీన ఓటు వేసిన అనంతరం అభిమానులకు, కార్యకర్తలకు కాదుగదా... అన్నాడీఎంకే మంత్రులకు సైతం దర్శనమివ్వలేదన్న సంగతి తెలిసిందే. పోలింగ్ రోజున వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆమెకు వ్యతిరేకంగా రావడంతో, ఇంటికే పరిమితమైపోయిన జయలలిత, ఇప్పుడు ఆరోసారి తనకు సీఎంగా అధికారం దగ్గరవుతున్నదని తెలుసుకుని కూడా ఇంకా బయటకు రాలేదు. తనను చూసేందుకు, అభినందనలు తెలిపేందుకు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు చెన్నయ్ లోని జయలలిత నివాసం ఉన్న పోయిస్ గార్డెన్ ముందుకు చేరుకుని సందడి చేస్తున్నారు. జయలలిత మాత్రం పూర్తి ఫలితాలు వెల్లడైన తరువాతనే బయటకు వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటివరకూ ఫలితాల సరళిని ఆమె ఇంట్లో నుంచే విశ్లేషిస్తారని సమాచారం. కాగా, కొద్దిసేపటి క్రితం ప్రధాని ఫోన్ చేయగా, ఆమె స్వయంగా మాట్లాడారని, ప్రధాని అభినందనలు స్వీకరించి, కృతజ్ఞతలు తెలిపారని పార్టీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.