: బిజీ బిజీగా గడుపుతున్నారా..? అదే మీ మానసిక ఆరోగ్యానికి రక్ష!
మీ వయసు యాబై దాటిందా..? తరుచూ బిజీ బిజీగా గడుపుతున్నారా..? అయితే మీ బిజీ జీవన విధానమే మీ మానసిక ఆరోగ్యానికి రక్ష అని చెబుతున్నారు అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీ పరిశోధకులు. ఆఫీస్ పనులు, దినచర్యలో మిమ్మల్ని బిజీగా ఉంచే అలవాట్లే మీ మనసుని ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచుతాయని తేల్చి చెబుతున్నారు. వర్సిటీ పరిశోధక బృందం 50 నుంచి 89 ఏళ్ల మధ్య వయసున్న 330 మంది వ్యక్తులను ఎంపిక చేసుకొని చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ప్రతీరోజు బిజీగా గడిపేస్తూ ఉన్న వాళ్ల మానసిక సామర్థ్యం ఎక్కువగా ఉందని, బిజీగా గడపని వాళ్లు అటువంటి ఉత్సాహాన్ని చూపడం లేదని పరిశోధకులు తెలిపారు. పరిశోధనలో పాల్గొన్న 330మంది వ్యక్తులకు న్యూరోసైకలాజికల్ పరీక్షలు చేసి వారి మానసిక శక్తిని లెక్కగట్టినట్లు చెప్పారు. శరీరంలోని ఏ భాగమైనా పనిచేయగా చేయగా అలసి పోతుంది.. కానీ మెదడు మాత్రం ఎంతగా కొత్త విషయాలు నేర్చుకుంటే అంతగా చురుకవుతుంది. బిజీ లైఫ్‌స్టైల్ గడుపుతూ అన్ని రకాల వయసువారు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, మానసిక రోగాల బారినుంచి తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మిమ్మల్ని బిజీగా ఉంచే అలవాట్లు, పనితీరు మిమ్మల్ని మరిన్ని విజ్ఞాన విషయాలు నేర్చుకునేలా చేస్తాయని, ఉత్సాహంగా ఉంచుతాయని చెప్పారు.