: నోకియా మొబైల్ ఫోన్లు మళ్లీ వచ్చేస్తున్నాయ్!
మొబైల్ ఫోన్ అంటే... నోకియానే. ఐదేళ్ల క్రితం దాకా ఒక్క భారతే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల మొబైల్ వినియోగదారుల మాట ఇదే. ఫిన్ ల్యాండ్ కు చెందిన ఈ టెక్నాలజీ దిగ్గజం ‘కనెక్టింగ్ పీపుల్’ ట్యాగ్ లైన్ తో ప్రవేశపెట్టిన మొబైల్ ఫోన్లు విశ్వవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి. 1998 నుంచి 2011 దాకా ప్రపంచ స్థాయి విక్రయాల్లో నోకియా ఫోన్లదే హవా. అన్ని మొబైల్ కంపెనీల్లోకి నోకియానే అగ్రగామి. అయితే స్మార్ట్ ఫోన్ల ఎంట్రీతో నోకియాకు ఒక్కసారిగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అప్పటిదాకా నోకియా దరిదాపుల్లోకి కూడా వచ్చేందుకు సాహసం చేయలేని శ్యాంసంగ్... స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని నోకియాను కిందకు నెట్టేసి అగ్రస్థానానికి ఎగబాకింది. ఆ తర్వాత నోకియా కోలుకోలేకపోయింది. 2014లో తన మొబైల్ ఫోన్ల తయారీని సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కు విక్రయించింది. మైక్రోసాఫ్ట్ తో నోకియా బ్రాండ్ ఒప్పందం వచ్చే నెలాఖరుకు ముగియనుంది. దీంతో గత వైభవాన్ని గుర్తు చేసుకున్న నోకియా... మళ్లీ రంగప్రవేశం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ తో బ్రాండ్ ఒప్పందం ముగియగానే... ఫిన్ ల్యాండ్ కే చెందిన కొత్త కంపెనీ ‘హెచ్ఎండీ గ్లోబల్’కు తన బ్రాండ్ ను ఇచ్చేయనుంది. నోకియా పేరిట మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేయడంతో పాటు విశ్వవ్యాప్తంగా విక్రయించుకునేందుకు హెచ్ఎండీ గ్లోబల్ కు నోకియా అనుమతి ఇచ్చేసింది. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. గతానుభవనాలను దృష్టిలో పెట్టుకుని త్వరలోనే మార్కెట్ లోకి రానున్న నోకియా ఫోన్లను హెచ్ఎండీ గ్లోబల్... విండోస్ ప్లాట్ ఫామ్ కు బదులు ఆండ్రాయిడ్ ప్లాట్ ఫామ్ పై ఉత్పత్తి చేయనుంది.