: తమిళనాట లోకల్ ఛానెల్స్ ఎగ్జిట్ పోల్స్... కొత్త ట్విస్ట్
జాతీయ ఛానెల్స్ అన్నీ డీఎంకే అధికారం చేపట్టనుందని, అన్నాడీఎంకే ప్రతిపక్షహోదాలో కూర్చోనుందంటూ కథనాలు ప్రసారం చేశాయి. అయితే, చివరి 2 గంటల్లో మహిళల పోలింగ్ శాతం అధికంగా నమోదైందని, దీంతో ఆ రెండు గంటల ఓటింగ్ లో అధికార అన్నాడీఎంకేకు అనుకూలంగా ఓటర్లు ఓటువేసి మద్దతు తెలిపారని లోకల్ ఛానెల్స్ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. దీంతో ఈ సర్వే ఫలితాలు కొత్త ట్విస్ట్ ఇచ్చాయి. తంతి టీవీ ఎగ్జిట్ పోల్ సర్వేలో అన్నాడీఎంకే 111, డీఎంకే 99, మూడో ఫ్రంట్ 3, పీఎంకే 2 స్థానాల్లో విజయం సాధించే అవకాశముందని తేలింది. వేదారణ్యం స్థానంలో బీజేపీ గెలుస్తుందని తంతి ఛానెల్ పేర్కొంది. అలాగే పుదియ తలైమురై ఎగ్జిట్ పోల్స్ సర్వేలో అన్నాడీఎంకే 164, డీఎంకే 66 స్థానాల్లో విజయం సాధిస్తాయని పేర్కొంది. మరో లోకల్ టీవీ ఛానెల్ 'కుముదమ్ రిపోర్టర్' ఎగ్జిట్ పోల్స్ సర్వేలో అన్నాడీఎంకే 162, డీఎంకే 41, డీఎండీకే 15 స్థానాల్లో విజయం సాధిస్తాయని పేర్కొన్నారు. దీంతో తమిళనాట గెలుపు ఎవరిది? అనే ఆసక్తి సర్వత్ర నెలకొంది. అయితే విజయం తమదంటే తమదేనని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.