: జూబ్లీహిల్స్ లో 'శివ' సినిమా యాక్షన్ సీన్... హాకీ స్టిక్స్ తో కొట్టుకున్న రెండు వర్గాలు!
గతంలో వచ్చిన 'శివ' సినిమాలో చూపించినటువంటి యాక్షన్ సీన్ ఈ రోజు సాయంకాలం హైదరాబాదు, జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 7లో నిజంగా దర్శనమిచ్చింది. రోడ్ నెంబర్ 7లో హాకీ స్టిక్స్, బేస్ బాల్ స్టిక్స్ తో రంగ ప్రవేశం చేసిన ఆకతాయి వర్గాలు నడి రోడ్డుపై ఘర్షణకు దిగారు. రెండు వర్గాలకు చెందిన వారు అకస్మాత్తుగా హాకీ, బేస్ బాల్ బ్యాట్లతో కొట్టుకుంటుండడంతో స్థానికులు ఆందోళన చెందారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఇరు వర్గాలు పరారయ్యాయి. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంచితే, మరో ఘటనలో జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 45లో నడి రోడ్డుపై కారులో మంటలు చెలరేగాయి. కారులోని వారు అప్రమత్తమవ్వడంతో ప్రమాదంలోంచి బయటపడ్డారు. కారు నడిరోడ్డుపై దగ్ధమైంది.