: ఇందిరాగాంధీ సామర్థ్యం ఆమెలో ఉందా? అంటే ఇప్పుడే చెప్పలేను: ప్రియాంకా గాంధీపై డిగ్గీరాజా కామెంట్స్
ప్రియాంకాగాంధీకి మాస్ లీడర్ గా ఎదిగే సత్తా ఉందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై ఆయన మాట్లాడుతూ, ప్రియాంకాగాంధీని క్రియాశీలక రాజకీయాల్లోకి తేవాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకువాల్సింది ఆమె కుటుంబమేనని అన్నారు. రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంకాగాంధీ నిలవనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆమె ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారా? అన్న ప్రశ్నకు 'అది కుటుంబ నిర్ణయ'మని ఆయన పేర్కొన్నారు. క్రియాశీలక రాజకీయాల్లోకి ఆమె వస్తే కాంగ్రెస్ పార్టీ సంతోషిస్తుందని ఆయన చెప్పారు. అయితే, ఇందిరా గాందీలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఆమెలో ఉన్నాయా? లేవా? అన్నది ఇప్పుడే చెప్పలేనని చెప్పిన ఆయన, ఇద్దరి మధ్య చాలా పోలికలున్నాయని మాత్రం అన్నారు. అయితే ఆమెలో మాస్ లీడర్ గా ఎదిగే శక్తిసామర్థ్యాలు బాగా ఉన్నాయని ఆయన చెప్పారు.