: నెల్లూరులో సుడిగాలి బీభత్సం.. నేలకొరిగిన చెట్లు, స్తంభాలు!
నేటి తెల్లవారు జాము నుంచి కురుస్తున్న వర్షాలతో నెల్లూరు జిల్లా అతలాకుతలమవుతోంది. నేటి ఉదయం నుంచి ఇప్పటి వరకు 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడుతో పాటు ఆ రాష్ట్ర సరిహద్దుల్లోని నెల్లూరు జిల్లా కూడా అతలాకుతలమవుతోంది. బాలాజీనగర్ లో వంద కిలోమీటర్లకు పైగా వేగంతో వచ్చిన సుడిగాలి కేవలం రెండున్నర నిమిషాల్లోనే బీభత్సం సృష్టించింది. విద్యుత్ స్తంభాలు, చెట్లు, రేకులు షెడ్డుల అంతు చూసింది. స్తంభాలు, చెట్లను నేలకొరిగేలా చేసిన ఈ సుడిగాలి, రేకుల షెడ్లను అమాంతం ఎత్తుకెళ్లిపోయింది. దీంతో నెల్లూరు పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.