: బలముందని, అధికారముందని పేదలమైన మా మీద ప్రతాపం చూపడం భావ్యమేనా..?: కేసీఆర్ కి జగన్ సూటి ప్రశ్న
‘బలముందని, అధికారముందని పేదలమైన మా మీద ప్రతాపం చూపడం భావ్యమేనా?' అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేసీఆర్‌ను ప్రశ్నించారు. మహబూబ్ నగర్లోనే నీళ్లన్నీ లాక్కుంటే శ్రీశైలానికి నీళ్లెలా వస్తాయని కర్నూలులో నిరశన విరమించాక జగన్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాజెక్టులతో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరుకి నీళ్లు రాకుండా పోతాయని ఆయన అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక అవసరాలు తీరాక మహబూబ్ నగర్‌కి నీళ్లు వస్తాయని, అక్కడనుంచి నీళ్లన్నింటినీ తెలంగాణ లాక్కుంటే ఇక ఏపీకి నీళ్లెలా వస్తాయని జగన్ ప్రశ్నించారు. గోదావరి నీరు ఏపీకి రాకముందే ఎడా పెడా వాడేస్తున్నారని ఆయన అన్నారు. వ్యవస్థలో మార్పు రావాలి, దీని కోసం మనం కృషి చెయ్యాలని జగన్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర , ఏపీ, తెలంగాణ అన్ని రాష్ట్రాలు ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. అందరూ కలిసుంటే కరవును ఎదుర్కోవచ్చని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అందరం కలిసే పోరాడాం అని జగన్ గుర్తు చేశారు.