: ఒకే ఒక్క ఉద్యోగితో ఉన్న సంస్థ... రూ. 140 కోట్లను లంచమిచ్చింది!
ఇండియాలో సంచలనం రేపిన అగస్టా వెస్ట్ ల్యాండ్ వీవీఐపీ చాపర్ల కుంభకోణానికి సంబంధించిన మరో కీలకాంశం వెలుగులోకి వచ్చింది. ఇండియాలో రూ. 140 కోట్లను ముడుపులుగా ముట్టజెప్పేందుకు మొహాలీ కేంద్రంగా నడుస్తున్న ఐడీఎస్ ఇన్ఫోటెక్, కేవలం ఒకే ఒక్క ఉద్యోగితో ట్యునీషియాలో అనుబంధ కంపెనీని ప్రారంభించిందని ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. చాపర్ల కాంట్రాక్టు కోసం ఈ డబ్బును ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతలు, మధ్యవర్తులకు అందించారని వెల్లడించింది. ఏప్రిల్ 4న ఈ విషయాలన్నీ చార్జ్ షీట్ రూపంలో ఇటలీలోని మిలాన్ కోర్టు ముందుకు వచ్చాయని పేర్కొంది. మొహాలీలోని చిరునామాతో రిజిస్టరైన ఐడీఎస్ ఇన్ఫోటెక్ సంస్థ ట్యునీషియాలో ఐడీఎస్ ట్యునీషియా అనే సబ్ సైడరీని ప్రారంభించిందని, అందులో ఒకే ఒక్క ఉద్యోగి ఉండేవాడని తెలిపింది. ఐడీఎస్ ఇన్ఫోటెక్ కుదుర్చుకున్న విదేశీ కాంట్రాక్టుల్లో భాగంగా ఏ విధమైన సేవలనూ అందుకోకుండా, ఎలాంటి సాఫ్ట్ వేర్ బిల్స్ లేకున్నా, నెలకు రూ. 3.14 కోట్లు చెల్లించేలా కండిషన్స్ ఉన్నాయని వెల్లడించింది. ఐడీఎస్ ట్యునీషియాలో గరవగాలియా పేరిట ఒకే ఉద్యోగి ఉండేవాడని, అతను డైరెక్టర్ కమౌన్ హేదీకి కార్యదర్శిగా పనిచేసేవాడని తెలిపింది.