: చంద్రబాబు వ్యూహం సక్సెస్!...సెల్ఫ్ డిఫెన్స్ లో మోదీ సర్కారు!


ఏపీకి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా నిన్న ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గతంలో కంటే మెరుగైన ఫలితాన్ని రాబట్టారు. దాదాపు మూడు రోజుల పాటు సుదీర్ఘ కసరత్తు చేసిన చంద్రబాబు... పక్కా వ్యూహం రచించుకుని హస్తినలో కాలు పెట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా సహా 12 అంశాలపై 18 పేజీల నివేదికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందజేసిన చంద్రబాబు... ముందుగా రచించుకున్న వ్యూహాన్ని అమలు చేసి, నరేంద్ర మోదీని సెల్ఫ్ డిఫెన్స్ లో పడేశారు. వెరసి ఏపీకి ప్రత్యేక హోదా సహా ఇతర అంశాలపై ఆయన స్పష్టమైన హామీని పొంది బయటకు వచ్చారు. ప్రత్యేక హోదా అంటూ ప్రధాని మోదీ ఎక్కడా ప్రస్తావించకున్నా, ఏపీకి అవసరమైన అన్నీ చేస్తామంటూ చంద్రబాబుకు భరోసా ఇవ్వక తప్పలేదు. అయితే తన వ్యూహంలో భాగంగా మోదీ ముందు చంద్రబాబు మాట్లాడిన పలు కీలక వ్యాఖ్యలను విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ తెలుగు దినపత్రిక నేటి తన సంచికలో ఆసక్తికర కథనాన్ని రాసింది. ఈ కథనం ప్రకారం... మోదీ ముందుకు వెళ్లగానే తన వెంట తీసుకెళ్లిన 18 పేజీల వినతి పత్రాన్ని చంద్రబాబు ప్రధానికి అందజేశారు. ఆ తర్వాత నోరు తెరచిన చంద్రబాబు వ్యూహాన్ని పక్కాగా అమలు చేశారు. ‘‘ప్రత్యేక హోదా మా హక్కు. దానిని ఇవ్వాల్సిందే. నీతి ఆయోగ్ ఒప్పుకోలేదనో, ఆర్థిక సంఘం చెప్పలేదనో దానిని వదులుకోలేం. హోదా ఇవ్వకపోతే పార్లమెంటుపైనే ప్రజలకు విశ్వాసం పోతుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్... ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మీరు ఉభయులూ కలిసి ఏపీకి హోదా ఇస్తామని వాగ్దానం చేశారు. అన్ని పార్టీలూ ఆమోదించాయి. ఇంత జరిగిన తర్వాత వెనక్కు వెళ్లడం మీ ప్రతిష్ఠకు మంచిది కాదు. ఏడాదికి రూ.60 వేల కోట్లిచ్చే రాజధాని హైదరాబాదును మేం కోల్పోయాం. దేశంలో ఇంత ఇబ్బందికర పరిస్థితిని ఏ రాష్ట్రం ఎదుర్కోలేదు. అందుకే హోదా అడుగుతున్నాం. త్వరగా ఇవ్వండి’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీంతో సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయిన ప్రధాని నరేంద్ర మోదీ... ఏపీకి అవసరమైన అన్నీ చేస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News