: 'బ్రహ్మోత్సవం'కి డబ్బింగ్ చెప్పేటప్పుడు నాకు తెలియకుండానే కన్నీరు వచ్చింది!: మహేష్
ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న తన కొత్త చిత్రం బ్రహ్మోత్సవం గురించి మరిన్ని కబుర్లు చెప్పాడు మహేష్ బాబు. ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా కాజల్ పేరును అసలు అనుకోలేదని, ఇద్దరు ముగ్గురు వేరే హీరోయిన్లను సంప్రదించి, ఆపై కాజల్ ను ఎంపిక చేశామని తెలిపాడు. సినిమా ప్రమోషన్ నిమిత్తం ఓ తెలుగు టీవీ చానల్ తో మాట్లాడిన మహేష్, ఈ సినిమాలో నటులు కనిపించరని, తెరపై పాత్రలు మాత్రమే కనిపిస్తాయని అన్నాడు. చిత్రం క్లైమాక్స్ సీన్ చేసిన తరువాత, ఇంటికి వెళ్లి ఈ చిత్రం ఒప్పుకున్నందుకు ఎంతో సంతృప్తి చెంది ఆనందంగా నిద్రపోయానని చెప్పాడు. కొన్ని సీన్లకు డబ్బింగ్ చెప్పేటప్పుడు తనకు తెలియకుండానే కళ్ల వెంట నీరు కారిందని, అవి గుండెల్లోంచి వచ్చినవని అన్నాడు. ఓ మ్యాజిక్ మాదిరిగా షూటింగ్ పూర్తయి పోయిందని, ఇక ఫలితం కోసం వేచి చూడటంలో తనకు ఎలాంటి ఆతృతా లేదని, ఇది గ్యారెంటీగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని వివరించాడు.