: నిండా మునిగిన 'పుణె'... వరుణుడి అండతో 'ఢిల్లీ'ని కూడా ముంచింది!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్ అవకాశాలను ఇప్పటికే కోల్పోయిన పుణె సూపర్ జెయింట్స్ జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్ అవకాశాలను దెబ్బతీసింది. వరుణుడు అడ్డుకోడవంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో పుణె జట్టు గెలవడంతో ఢిల్లీ, తనకు మిగిలిన రెండు మ్యాచ్ లలోనూ తప్పనిసరిగా గెలిస్తేనే తదుపరి రౌండుకు వెళ్లనుంది. ఈ రెండు మ్యాచ్ లనూ దూసుకెళుతున్న హైదరాబాద్ సన్ రైజర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లపై ఆడాల్సి వున్నందున వారిని ఓడించి ప్లే ఆఫ్ కు చేరడం ఢిల్లీకి కష్టమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు బ్యాటింగ్ లో విఫలమై 20 ఓవర్లలో 121 పరుగులు మాత్రమే చేసింది. కరణ్ నాయర్ మాత్రమే చెప్పుకోతగ్గ స్కోరు (41) చేశాడు. ఆపై 122 పరుగుల లక్ష్యంతో ధోనీ సేన బరిలోకి దిగగా, 8.2 ఓవర్లలో స్కోరు ఒక వికెట్ నష్టానికి 57 పరుగుల వద్ద, ఆపై 11 ఓవర్లలో 76/1 వద్ద ఉన్న సమయంలో వరుణుడు అడ్డుపడ్డాడు. వర్షం భారీగా పడుతూ ఉండటంతో ఆట జరిగే పరిస్థితి లేకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ద్వారా పుణె జట్టు గెలిచినట్టు రిఫరీలు ప్రకటించారు. దీంతో ఢిల్లీ జట్టు అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.