: ఇదెలా సాధ్యమైందబ్బా?... అమరావతి భూసేకరణపై కేంద్రం ప్రత్యేక దృష్టి!
రైతుల నుంచి ప్రభుత్వ అవసరాలకు భూమిని సేకరించాలంటే... అదో పెద్ద ప్రయాసతో కూడుకున్న వ్యవహారం. ఇది ఇప్పటిదాకా అటు కేంద్రంతో పాటు ఇటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ ఉన్న భావన. మరి నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానికి ఏకంగా 34 వేల ఎకరాల సేకరణ ఎలా సాధ్యమైంది? అది కూడా స్వల్ప వ్యవధిలో. పెద్దగా వ్యతిరేకత లేకుండానే. అక్కడక్కడ కొంతమేర నిరసన వ్యక్తమైనా... స్వయంగా రైతులే ముందుకు వచ్చి తమ భూమిని రాజధాని నిర్మాణానికి ఇస్తున్నామంటూ సంతోషంగా అంగీకార పత్రాలు అందజేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా పూర్తి చేసింది. దీనిపై తాజాగా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. అసలు అమరావతి భూసేకరణలో రైతులే ముందుకు వచ్చి భూములిచ్చిన వైనం కేంద్రం పెద్దలను బాగా ఆకర్షించింది. ఆ మర్మమేమిటో తెలిస్తే... ఇతర ప్రాంతాల్లోనూ భూసేకరణ సులువవుతుంది కదా అని భావించింది. అనుకున్నదే తడవుగా కేంద్రం ఓ ఉన్నత స్థాయి అధికారిని నిన్న అమరావతికి పంపింది. కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి రాజగోపాల్ కేంద్రం ఆదేశాలతో నిన్న అమరావతిలో పర్యటించారు. తొలుత సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లిన ఆయన ఆ తర్వాత రాజధాని గ్రామాల్లో పర్యటించారు. దీనిపై త్వరలోనే ఆయన కేంద్రానికి నివేదిక సమర్పిస్తారు.